ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. పాదయాత్రలో భాగంగా శనివారం (నవంబర్ 30) గ్రేటర్ కైలాష్‌లో ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ యువకుడు దాడి చేసి, బాటిల్‌తో ద్రావణాన్ని పోశాడు. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్.. ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకొని చితకబాదారు. అతడి వద్ద ఉన్న బాటిల్‌ను పరిశీలించగా.. అందులో స్పిరిట్ ఉన్నట్లు గుర్తించామని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
కేజ్రీవాల్ పాదయాత్రలోకి చొరబడిన నిందితుడు మద్దతుదారుల మధ్య నడుచుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా గుంపులో నుంచి కేజ్రీవాల్ సమీపానికి వచ్చి బాటిల్‌ను తీసి.. అందులో ఉన్న ద్రవాన్ని కేజ్రీవాల్‌పై పోసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆప్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.
కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడింది బీజేపీ కార్యకర్తేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఆరోపించారు. దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. నిందితుడు ప్రధాని మోదీతో కలిసి ఫోటోలో ఉన్నట్లు ఆరోపించారు. 35 రోజుల వ్యవధిలో కేజ్రీవాల్‌పై మూడోసారి దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌పై గతంలోనూ ఓ వ్యక్తి ఇంక్ దాడి చేశాడు. ఏకంగా సీఎం క్యాంప్ కార్యాలయంలోనే అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చిమ్మడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంతలోనే కేజ్రీవాల్‌పై దాడి జరగడం.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.