ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపం.. విలువ రూ.7లక్షల కోట్లపైనే, ఎక్కడ బయటపడిందంటే

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 09:05 PM

చైనాకు బంగారు పంట పండింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారీ బంగారు గని.. చైనాలో బయటపడినట్లు తాజాగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం.. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని గనుల్లో 100 మెట్రిక్ టన్నుల బంగారం ఉండొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా హునాన్ ప్రావిన్సులో జియోలాజికల్ బ్యూరో అధికారులు సర్వే చేసి వెల్లడించిన వివరాలను అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు నిక్షేపాలను కనుగొన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్‌ హునాన్ ప్రావిన్స్ ధ్రువీకరించింది.


ప్రాథమికంగా చేపట్టిన అన్వేషణలో భూమికి 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలకు సంబంధించిన గనులు బయటపడినట్లు చైనా అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యాధునికమైన 3డీ మోడలింగ్ టెక్నాలజీని ఉపయోగించి.. భూమిలో మరింత ఎక్కువ లోతుకు వెళ్లి బంగారు నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. భూమి పైనుంచి 3వేల మీటర్ల లోతులో ఈ గోల్డ్ మైన్స్ ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ఈ బంగారం విలువ మొత్తం సుమారు 83 బిలియన్ అమెరికా డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.7 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.


 ఇక ఈ కోర్ శాంపిల్స్ అధ్యయనం ప్రకారం.. ఈ పింగ్జియాంగ్ కౌంటీ ప్రాంతంలోని 1 మెట్రిక్ టన్ను రాతిలో 138 గ్రాముల బంగారాన్ని తీయవచ్చని శాస్రవేత్తలు వెల్లడించారు. ఇక ఇప్పటికే ప్రపంచ గోల్డ్ మార్కెట్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో 2వేల టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయని కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ అంచనాను వేశారు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో దాదాపు 10 శాతం చైనాలోని మైనింగ్ నుంచే వెలికి తీస్తున్నారు


ఇక ఈ చైనాలోని భారీ బంగారు నిక్షేపం బయటపడకముందు.. దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్‌లో లభించిన 930 మెట్రిక్ టన్నుల బంగారు గని.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉండేది. ఇక ఇవే కాకుండా మైనింగ్ టెక్నాలజీ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద టాప్ 10 బంగారు నిక్షేపాలు ఇవే


సౌత్ డీప్ గోల్డ్ మైన్ - దక్షిణాఫ్రికా


గ్రాస్‌బర్గ్ గోల్డ్ మైన్ - ఇండోనేషియా


ఒలింపియాడా గోల్డ్ మైన్ - రష్యా


లిహిర్ గోల్డ్ మైన్ - పపువా న్యూ గినియా


నోర్టే అబియర్టో గోల్డ్ మైన్ - చిలీ


కార్లిన్ ట్రెండ్ గోల్డ్ మైన్ - అమెరికా


బోడింగ్టన్ గోల్డ్ మైన్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా


ఎంపోనెంగ్ గోల్డ్ మైన్ - దక్షిణాఫ్రికా


ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్ - డొమినికన్ రిపబ్లిక్


కోర్టెజ్ గోల్డ్ మైన్ - అమెరికా







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com