అనంతపురం జిల్లాలోని ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనకల్లు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్యులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని బళ్లారి ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడీషియన్ యోగేశ్, ఆంకాలజిస్ట్ గోవిందరాయ, అమరేశ్ పాటిల్‌గా గుర్తించారు. కారు నడుపుతోన్న వెంకటి నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వీరంతా విహారయాత్రకు హాంకాంగ్ వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. విడపనకల్లు మండల కేంద్రంలో 42 వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకటి నాయుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారి తరలించారు. బాధితులు హాంకాంగ్ పర్యటన ముగిసిన అనంతరం శనివారం స్వదేశానికి విమానంలో బయలుదేరారరు. వీరు ఆదివారం తెల్లవారుజాము 1:30 ప్రాంతంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగిన అనంతరం.. రోడ్డుమార్గాన బళ్లారికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సమయంలో పొగమంచు విపరీతంగా కురుస్తుండగా.. డ్రైవర్ వాహనం వేగంగా నడపడంతో అదుపు తప్పినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు.
కాగా, గతవారం గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో.. 8 మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు.. ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది.