నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ట్రాన్స్ జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్యపోరే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని, వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. హాసిని, అలేఖ్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వీరిపై తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయన్నారు.
హాసినికి సులోచన, షీలా అనే ట్రాన్స్ జెండర్లతోను విభేదాలు ఉన్నాయని, దీంతో అలేఖ్య, సులోచన, షీలాలు కలిసి హాసినీని మరికొందరి సహాయంతో కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 26న దారుణంగా హత్య చేయించారని తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామన్నారు. కేసును పరిశోధించిన కొడవలూరు, విడవలూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.