పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, దివంగత ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై.. సిక్కుల అత్యున్నత సంస్థ అయిన అకాల్ తఖ్త్ కఠిన నిర్ణయం తీసుకుంది. డేరా బాబాకు మద్దతుగా ఉన్నందుకు.. తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. పంజాబ్ అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంతోపాటు పలు గురుద్వారాల్లో ఉండే కిచెన్, బాత్రూంలను శుభ్రం చేసే పనిని అప్పగించింది. అంతటితో ఆగకుండా ఆయన తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు గౌరవంగా ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్(సిక్కు మతానికి గర్వకారణం)ను తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. సిక్కు సమాజానికి చేసిన సేవలకు గాను 2011లో ప్రకాష్ సింగ్ బాదల్‌కు ఫఖర్-ఎ-కౌమ్‌తో సత్కరించారు.
2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా సుఖ్‌బీర్ బాదల్ వ్యవహరించారని.. అకాల్ తఖ్త్ తేల్చింది. అయితే తాను చేసిన అన్ని పనులకు సుఖ్‌బీర్ బాదల్ క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ మాత్రం కఠిన శిక్షను వేసింది. అయితే ప్రస్తుతం వీల్‌చైర్‌లో ఉన్న సుఖ్‌బీర్ బాదల్, 2015లో పంజాబ్ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు, అకాలీదళ్ నేతలు.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలోని బాత్రూంలను శుభ్రం చేస్తారని.. అకాలీ తఖ్త్ వెల్లడించింది. ఆ తర్వాత స్నానం చేసి.. లంగర్ వడ్డిస్తారని తెలిపింది. సుఖ్‌బీర్ బాదల్.. తాను చేసిన తప్పులకు గానూ అకాల్ తఖ్త్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ శిక్షను విధించారు.
ఇక 2007లో గుర్మీత్ రామ్ రహీమ్.. సిక్కు గురువుల మాదిరిగానే దుస్తులు ధరించి ఒక వేడుకను నిర్వహించాడు. దీంతో అతడు అందుకుగాను అకల్ తఖ్త్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈ క్రమంలోనే తన ప్రభావాన్ని ఉపయోగించి డేరా చీఫ్‌కు.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని ఆరోపణలు రాగా.. వాటిపై విచారణ జరిపి అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక సోమవారం రోజున ఉదయం.. అకాల్ తఖ్త్ జాతేదార్ గియాని రగ్బీర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు మతానికి చెందిన ఐదుగురు అత్యున్నత వ్యక్తులు.. దుష్ప్రవర్తనకు మతపరమైన (క్వాంటమ్ ఆఫ్ తంఖా)ను విధించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన రాజీనామాను ఆమోదించి.. 6 నెలల్లోగా కొత్త చీఫ్‌ను నియమించాలని వర్కింగ్ కమిటీకి జాతేదార్ సూచించారు.
2007 నుంచి 2017 వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు అకాలీ దళ్ పార్టీ చేసిన తప్పులకు.. మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు సుఖ్‌బీర్ బాదల్‌ను ఆగస్ట్‌లో అకాల్ తఖ్త్ దోషిగా గుర్తించింది. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డేరా అనుచరులు, సిక్కుల మధ్య ఘర్షణలను ప్రేరేపించినందుకు గుర్మీత్ రామ్ రహీమ్‌కు క్షమాభిక్షకు సంబంధించిన కేసు కూడా ఇందులో ఉంది.