మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. మహాయుతి కూటమి బంపర్ విక్టరీ సాధించినా.. కొత్త ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోతోంది. కూటమిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీల మధ్య సీఎం, కేబినెట్ బెర్తుల పంపకాలు కొలిక్కి రావడం లేదు. ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో ఈ ముగ్గురు నేతలు భేటీ అయి.. తిరిగి మహారాష్ట్ర చేరుకున్నారు. ముంబైలో వీరి మళ్లీ కావాల్సిన భేటీ రద్దు కావడం, షిండే సొంతూరికి వెళ్లడం, బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవి అంటూ ప్రచారం చేయడం లాంటి పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. ఇక ఈనెల 4వ తేదీన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం, ఆ తర్వాతి రోజే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్.. ఉన్నఫళంగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌గా మారింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించాలి అనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇక స్వల్ప అనారోగ్యం కారణంగా సొంత గ్రామానికి వెళ్లిన ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే.. మహాయుతి కూటమి నిర్వహించాల్సిన కీలక సమావేశాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్నది బీజేపీ అగ్రనాయకత్వానికే వదిలేసినట్లు చెప్పిన షిండే.. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇక బీజేపీ నేతలు మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్‌నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక ఈ నెల 5వ తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని.. అదే రోజు నూతన ప్రభుత్వం కొలువుదీరనుందని ఇప్పటికే మహారాష్ట్రలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సీఎం పీఠం ఎవరికీ అనేదానిపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదు. ఇక మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఆలస్యంపై ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడీ.. మహాయుతి కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు మెజార్టీ ఇచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారని.. అందుకే అసెంబ్లీ గడువు ముగియడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.