మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం ఎవరికి ఇవ్వాలి అనేది తేలకపోవడంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. మహాయుతి కూటమి నేతలు మాత్రం ఈనెల 4వ తేదీన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని.. ఈనెల 5వ తేదీన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా నిర్ణయించకపోవడంతో ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నేతృత్వంలో మహాయుతి కూటమి నేతల సమావేశం జరిగినా పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి ఎంపిక కోసం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీలను మహారాష్ట్రకు పరిశీలకులుగా బీజేపీ హైకమాండ్ నియమించింది.
మహరాష్ట్ర సీఎం ఎంపిక నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరగనున్న.. బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ హాజరు కానున్నారు. ఇందులో భాగంగా వారిద్దరూ మంగళవారమే ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఒంటరిగా చర్చలు జరిపేందుకు ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. ఇక మహారాష్ట్రలో మహాయుతి కూటమి మధ్య కేబినెట్ పదవుల కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ముంబైలో కీలక సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. షిండే ఈ భేటీని రద్దు చేసుకుని స్వగ్రామానికి వెళ్లారు.
ప్రస్తుతం గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న షిండే.. సతారా జిల్లాలోని తన సొంతూరిలో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం బీజేపీ పెద్దలతో ఏక్‌నాథ్ షిండే భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే షిండే శివసేన వర్గాలు మాత్రం.. ఏక్‌నాథ్ షిండేకు, బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు కాలేదని పేర్కొన్నారు. ఇక సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. అయితే కేబినెట్ బెర్తుల కోసం మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కి రావడం లేదని సమాచారం.