మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు దేశంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా.. మహారాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు అని తేలడం లేదు. మహాయుతి కూటమి నేతలతో ఢిల్లీలో అమిత్ షా భేటీ అయినా.. ఈ సస్పెన్స్ మాత్రం వీడటం లేదు. ఇక ముంబైలో జరగాల్సిన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు భేటీ కావాల్సి ఉన్నా.. షిండే ఆకస్మికంగా తన సొంతూరికి వెళ్లిపోవడంతో రద్దయింది. దీంతో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అవుతోంది. అయితే ఇప్పుడు అప్పుడు సీఎం ఎవరు అనేది అధికారిక ప్రకటన వెలువడుతుందని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నప్పటికీ.. అది మాత్రం జరగడం లేదు.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర డిప్యూటీ పదవిని తనకు అప్పగించనున్నారని వస్తున్న వార్తలను ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కొట్టి పారేశారు. ప్రస్తుతం కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న శ్రీకాంత్ షిండేను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ ఏక్‌నాథ్ షిండే మహాయుతి కూటమి పెద్దలతో చర్చలు జరిపారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలను శ్రీకాంత్ షిండే తాజాగా ఖండించారు. తన గురించి నిరాధారమైన వార్తలు వస్తున్నాయని.. తాను మహారాష్ట్రలో ఏ మంత్రి పదవి రేసులో లేనని శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది కాబట్టే చర్చలు, పుకార్లకు దారి తీసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే అనారోగ్య సమస్యల కారణంగా 2 రోజుల పాటు స్వగ్రామంలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో తాను ఉపముఖ్యమంత్రి అవుతాననే ఊహాగానాలు జోరందుకున్నాయని.. అయితే అవన్నీ అసత్యాలే అంటూ శ్రీకాంత్ షిండే తన ట్వీట్‌లో తేల్చి చెప్పారు.
ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత తనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చిందని.. అయితే తాను పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు శ్రీకాంత్ షిండే తెలిపారు. అప్పుడే తాను మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. అధికారంలో ఉండాలనే కోరిక తనకు లేదని.. రాష్ట్రంలో మంత్రి పదవి రేసులో తాను లేనని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గం కళ్యాణ్‌కు, శివసేనపార్టీకి మాత్రమే పనిచేస్తారని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఊహాగానాలు ఆపేస్తారని కోరుతున్నట్లు శ్రీకాంత్ షిండే వెల్లడించారు.