నిర్లక్ష్యంగా శస్త్రచికిత్స చేసి బాధితుడి కంటిచూపు కోల్పోవడానికి కారణమైన నెల్లూరులోని ఒక ప్రముఖ వైద్యశాల యాజమాన్యానికి రూ.61.62 లక్షల జరిమానా విధిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ బుధవారం తీర్పు ఇచ్చారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చేవూరు సురేశ్‌బాబు పంచాయతీ కార్యదర్శి. 2017, మే నెలలో కంటి వైద్యం కోసం నెల్లూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చారు. సైనసైటిస్ శస్త్ర చికిత్స చేసుకోవాలని డాక్టర్ సూచించగా.. అదే నెల 11న పెప్టో, మినీ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఎఫ్‌ఈఎ్‌సఎస్) శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే.. 12న ఎడమ కంటి చూపు కోల్పోయాడు. తలకు సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి.
తర్వాత చెన్నైలోని అపోలో, బ్రెయిన్ అండ్ స్పైన్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయాధికారి రెడ్డి శేఖర్ ఆ వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు పూర్తిగా కంటి చూపు కోల్పోయారని నిర్ధారించారు. బాధితుడు శస్త్రచికిత్సలు, మందులు, ఇతర ఖర్చులకు రూ.21,62,752 చెల్లించినట్లు బిల్లులు సమర్పించారు. దీంతో ఖర్చుతోపాటు శారీరక, మానసిక వేదనకు గాను బాధితుడికి రూ.40 లక్షలు, మొత్తం రూ.61,62,752 పరిహారం చెల్లించాలని ఆ వైద్యశాల యాజమాన్యాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.