బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అనిత అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లు, కొండచరియలు ఉండే ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక సందేశాలు పంపాలని సూచించారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.