ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో జాతీయ రహదారులు, రైలు మార్గాలపై సమీక్ష చేశారు. కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు సంబంధించి.. ప్రకాశం జిల్లాలోని భూసేకరణకు రూ.12 కోట్లు పెండింగ్‌లో ఉందని ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే తెలిపారు. ఆ నిధులు విడుదల చేస్తే భూసేకరణ కొలిక్కి వస్తుందని చెప్పగా.. వెంటనే స్పందించిన చంద్రబాబు.. వెంటనే (శుక్రవారమే) ఆ నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.
మరోవైపు కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రైలు మార్గం వెళ్లే 13 కిలో మీటర్లకు సంబంధించిన భూములు అప్పగించకపోవడంతో పనులు ఆగిపోయాయని కాంతిలాల్ దండే సీఎంకు వివరించారు. వెంటనే స్పందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్.. ఆ భూముల్లో వరికోతలు మొదలయ్యాయని.. వచ్చేనెల నుంచి రైల్వే అధికారులు పెగ్‌మార్కింగ్ వేసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కొత్త రైల్వే లైన్‌లు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేసేలా చూడాలన్నారు చ్రందబాబు. రైల్వేలైన్లు, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులపైనా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్ష చేయాలన్నారు. విశాఖపట్నంలో రైల్వేజోన్ కార్యాలయ పనులపై ప్రత్యేకదృష్టి సారించాలని తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల పనుల్లో ఎవరి జోక్యం ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి. ఒకవేళ ఎవరైనా కావాలని పనులు ఆపాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.65వేల కోట్లతో జరుగుతున్న జాతీయ రహదారుల పనులు రెండేళ్లలో పూర్తికావాలి అన్నారు. జిల్లాల్లో ఎన్‌హెచ్ పనులపై కలెక్టర్లు ప్రతినెలా సమీక్షించాలని.. పీపీపీ రోడ్లపైనా కలెక్టర్లు ఫోకస్ పెట్టాలన్నారు. 2026 డిసెంబరుకు అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో డీపీఆర్ ఆమోదం, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తే అందరికీ మంచిపేరు వస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేషనల్ హైవే పనుల్లో ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాభూములు ఉన్నాయని.. వాటికి పరిహారంపై సందిగ్ధత ఉందని కలెక్టర్ వివరించారు. ఈ అంశశంపై రెవెన్యూశాఖ స్పష్టతనిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పనులకు భూసేకరణ, అటవీ భూముల అంశాలపై టాస్క్‌ఫోర్స్‌తో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు కాంతిలాల్ దండే. ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌పై డ్రోన్ సర్వే పూర్తయ్యిందని.. నెలాఖరుకు మోర్త్‌కు పంపుతామన్నారు. జనవరి 15 నాటికి గుంతలరహితంగా మార్చడమే లక్ష్యంగా పనులు చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 మార్చి నెలాఖరులోగా వీటిని ప్రారంభించాలని భావిస్తున్నారు.. ఈ మేరకు ప్రతిపాదనలను ఆర్థికశాఖ ఆమోదించింది. క్యాంటీన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది ప్రభుత్వం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa