మోసం చేయడమే చంద్రబాబు నైజం అని, ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన హామీలేవీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషయం ఆరు నెలల్లోనే తేలిపోయిందని వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాలను వంచించాయని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు మాట చెప్పడం.. అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబుకి తెలిసిన విద్య. రైతులు ఏ విధంగానూ నష్టపోకూడదని గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ వారికి ఎంతో అండగా నిలబడ్డారు. విత్తనం నుంచి పంటల విక్రయం వరకు వారికి అడగుడుగునా తోడుగా నిలబడ్డారు. అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. చంద్రబాబు మీద రైతు వ్యతిరేకి అనే ముద్ర ఉంది. రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది మండిపడ్డారు.