ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం..

international |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 12:30 PM

కోల్‌కతా: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్‌  సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. తాజాగా ఈ పని వేళల అంశంపై మరోసారి మాట్లాడిన నారాయణమూర్తి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. వారానికి 70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా అధిగమించగలమని ప్రశ్నించారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్‌ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?'' అని నారాయణమూర్తి  తెలిపారు. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంపన్నులపై భారత్‌ అధిక పన్నులు విధించాలి ఆ మధ్య ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ది రికార్డ్‌' అనే పాడ్‌కాస్ట్‌ తొలి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.              






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com