భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లేఖలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్రం ప్రభుత్వం లేఖ రాసింది. నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఈ మేరకు లేఖ పంపింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ.. 2008లో ఆ లేఖలను తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని అందులో కోరింది.
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన చాచాజీ లేఖలను.. జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే, 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన వాటిని సోనియాగాంధీకి 2008లో పంపారు. అప్పటినుంచి ఆ లేఖలు ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రధాన మంత్రి లైబ్రరీ కోరింది. దీనిపై స్పందించకపోవడంతో రాహుల్ గాంధీకి డిసెంబర్ 10న మరోసారి లేఖ రాసి, అభ్యర్థన చేసింది. కనీసం ఫొటో కాపీలు లేక డిజిటల్ కాపీలు అయినా అందజేయాలని కోరిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జవహర్‌లాల్ నెహ్రూ.. ఎడ్వినా మౌంట్‌బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి 20వ శతాబ్దం నాటి చాలా మంది ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అందులో ఉన్నాయి. ఇక, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ఈ మ్యూజియమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
కాగా, స్వాతంత్య్ర పోరాట సమయంలో జైలుకెళ్లినప్పుడు.. తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినిలో లేఖల ద్వారానే నెహ్రూ స్ఫూర్తి నింపారు. ‘లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు హిస్ డాటర్’ అనే పేరుతో ఆ లేఖలను ముద్రించారు. అలహాబాద్ లా జర్నల్ ప్రెస్.. నెహ్రూ కోరిక మేరకు వాటిని ముద్రించింది. జైల్లో ఉన్న నెహ్రూ పదేళ్ల తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి రాసిన 30 లేఖలను అచ్చువేశారు. ఆ తర్వాత లభించిన లేఖలను కూడా కలిపి పలుమార్లు పునః ముద్రణ చేశారు.