రెండు రోజుల క్రితం (శుక్రవారం) పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.9 కోట్లతో బాగుజోల గ్రామ రహదారి పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే గిరిజన ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా బల్లగరువు గ్రామంలో 13 రహదారులకు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.అంతకుముందు బల్లగరువు నుంచి కొండపైకి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు స్థానిక గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. వారితో సరదాగా ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలన్నీ త్వరలోనే తీర్చుతానని పవన్ హామీ ఇచ్చారు.
అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా పవన్ పర్యటన కొనసాగించారు.తమ గోడు వినేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వందల ఏళ్లుగా రోడ్లు, వైద్య, విద్య సదుపాయం లేక నానావస్థలు పడుతున్నామని, అలాంటిది ఇన్నాళ్లకు తమ సమస్యలు తీర్చేందుకు ఓ నాయకుడు వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. వారి సమస్యలు చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.