సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం కష్టమవుతోంది. ఆదివారం తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేవని, అందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 26 (గురువారం) వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా.. లేదా తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి, తర్వాత అది వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావించారు. అయితే అది రెండ్రోజులకు తీవ్ర అల్పపీడనంగా మారి ఏపీ తీరం వైపు వచ్చింది.