జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ లో ఓ సైనిక వాహనం 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మృతి చెందిన జవాన్లు నెంబర్ 11 మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందినవారు. వీరంతా క్విక్ రియాక్షన్ టీమ్ (QRT) లో సభ్యులు. సైనిక వాహనం నియంత్రణ రేఖ వెంబడి ప్రయాణిస్తుండగా, పూంఛ్ సెక్టార్లో ఈ ప్రమాదం జరిగింది. సైనికులు నీలమ్ ప్రాంతంలో ఉన్న స్థావరం నుంచి బల్నోయి ఘోరా పోస్ట్ వద్దకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు సహాయచర్యలు ప్రారంభించారు.