గోవాలో తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. నూతన సంవత్సర వేడుకలకు తాడేపల్లిగూడెం నుండి ఎనిమిది మంది మిత్రుల బృందం గోవా వెళ్లింది.డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్ కు యువతి యువకుల బృందం వెళ్లిన సమయంలో బృందంలోని ఒక యువతి పట్ల రెస్టారెంట్ యజమాని కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారి తీరును తాడేపల్లి గూడెం యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఈ వ్యవహారంపై బాధితుల సమాచారంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళడంతో గోవా ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి రవితేజ మృతదేహానికి త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెం తరలించారు.
ఏం జరిగిందంటే..
హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకునే విషయంలో తలెత్తిన వివాదంతో ఘర్షణ జరిగినట్టు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. ఏపీకి చెందిన పర్యాటక బృందం నుంచి అదనపు ఫుడ్ ఆర్డర్లు తీసుకోవడానికి రెస్టారెంట్ నిర్వాహకులు నిరాకరించడంతో వాగ్వాదం మొదలైంది.గోవాలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో ఓ హోటల్ యజమాని, అతని సిబ్బందితో జరిగిన గొడవలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 28 ఏళ్ల పర్యాటకుడు మృతి చెందినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మృతుడిని ఏపీకి చెందిన భోలా రవితేజగా గుర్తించామని, నేపాల్ కు చెందిన హోటల్ యజమాని అగ్నెల్ సిల్వేరా (64), అతని కుమారుడు షుబర్ట్ సిల్వేరియా (23), అక్కడ పనిచేసే ఇద్దరు సిబ్బంది అనిల్ బిస్తా (24), సమల్ సునార్ (23)లను అరెస్టు చేసినట్టు గోవా పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కలంగుటే బీచ్ లోని మెరీనా షాక్ వద్ద ఫుడ్ ఆర్డర్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదం హింసకు దారితీసింది. నిందితులు తేజపై కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రగాయాలతో తేజ మృతి చెందినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.రెస్టారెంట్ మూసివేసే సమయంలో అదనపు ఆర్డర్లు తీసుకోవడానికి నిరాకరించడంతో వాగ్వాదం మొదలైందని, అంతకు ముందు ఆర్డర్ చేసిన వంటకాల బిల్లును తాడేపల్లి గూడెంకు చెందిన బృందం ప్రశ్నించడంతో ఇది మరింత ముదిరిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో బిల్లును చెల్లించడానికి నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాస్త హింసకు దారి తీసి పర్యాటకుడిపై దాడికి దారితీసిందని చెబుతున్నారు.