కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ-హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతం ఛైర్‌కార్‌తోనే నడుస్తుండగా.. త్వరలోనే స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతోంది. వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు చేపడుతోన్న పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగం అందుకుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అందులో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు 180 కి.మీ. వేగంతో దూసుకెళ్లింది. అయితే, అంత వేగంలోనూ సీటు వద్ద ఉన్న ట్రేపై ఉంచిన గ్లాసులో చుక్క నీరు కూడా తొణకలేదు.
ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా డివిజన్‌లో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. జనవరి 1న రైలును 130 కి.మీ. వేగంతో నడిపారు. ఆ తర్వాత దీన్ని క్రమంగా 140 కి.మీ., 150 కి.మీ., 160 కి.మీ.లు పెంచారు. తాజాగా గురువారం ఈ వేగం గంటకు 180 కిలోమీటర్లకు చేరుకుంది. కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య రైలు 180 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ట్రయల్ రన్‌లో సాధారణ ప్రయాణికులతో సమానంగా ఉండే బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. ఈ ట్రయల్స్ వచ్చే నెలలోనూ కొనసాగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి డిసెంబరులోనే వందే భారత్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని కజురహో నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజుల పాటు స్లీపర్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తం 16 బోగీలతో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపనున్నారు. ఇందులో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అదనంగా అందుబాటులో ఉంటాయి. మరో రెండు నెలల్లో స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న రైల్వే శాఖ తొలి దశలో 10 రైళ్లను ప్రవేశపెట్టనుంది.