కొత్త కొత్త వైరస్‌లకు, రోగాలకు జన్మస్థానమైన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ చైనాలో వ్యాపిస్తోంది. కరోనాలాగే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ, జనాలను ఆస్పత్రులకు పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్త వైరస్ లక్షణాలు
ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపీవీ(హ్యుమన్ మెటానియా వైరస్). దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనూ ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తల నొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
కరోనా కంటే ప్రమాదకరమా?
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్‌కు ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదకరం?
ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు. కానీ, వారి ద్వారా వ్యాప్తి చెందగలదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయస్సుల వారికి ప్రాణాంతకమే. చిన్నా పెద్దా లేకుండా అందర్నీ ఆస్పత్రి పాలు చేస్తుంది ఈ వైరస్. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
చికిత్స ఎలా?
జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినా సాధారణంగా వచ్చే జలుబు అనే అనుకుని చాలా మంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు.