జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశమైన కోర్ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది.2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్ కల్యాణ్ ‘జనసేన’ స్థాపించారని... పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని.. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించబోతున్నామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ, తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొంటామని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమిస్తామన్నారు. 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందన్నారు.