పలు సందర్భాల్లో పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. చివరి సారిగా 2016లో అప్పటి రూ.1000, రూ.500 పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను తెచ్చారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్లకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5000 విలువైన కరెన్సీ నోట్లను విడుదల చేయనుందని ఓ ప్రచారం వైరల్ అవుతోంది. ఓ నోటు ఫోటో సైతం ఆయో పోస్టుల్లో కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగులో ఉన్న రూ.5 వేల నోటును చూడవచ్చు. మరి నిజంగానే ఆర్‌బీఐ ఐదు వేల రూపాయల నోటును తీసుకొస్తోందా?
క్లెయిమ్ ఏంటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే రూ.5000 విలువైన కరెన్సీ నోటును చలామణిలోకి విడుదల చేయనుంది. అలాంటి క్లెయిమ్స్ ఇక్కడ, ఇక్కడ ఇక్కడ చూడొచ్చు)
అసలు నిజం ఏంటి?
సోషల్ మీడియాలో చలామణి అవుతున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.5000 కరెన్సీ నోట్ల విడుదలపై ఎలాంటి ప్రకటన రాలేదు. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు.
ఎలా తెలుసుకున్నామంటే..
రూ.5000 కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ నోటు వైరల్ అవుతోంది. ఆకుపచ్చ రంగులో ఉన్న నోటును చూస్తే 2016లో ఆర్‌బీఐ కొత్తగా తీసుకొచ్చిన నోట్ల మాదిరిగానే ఉంది. దీంతో చాలా మంది నిజమని షేర్ చేస్తున్నారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సైతం పూర్తిగా తప్పుడు వార్తగా తేల్చింది. ఆర్‌బీఐ నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదని తెలిపింది. మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్లో కొత్త నోట్ల విడుదలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు కనిపించలేదు.
అయితే, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. అందులో రూ.2000 బ్యాంక్ నోట్ల ఉపసంహరణకు సంబంధించిన స్టేటస్ వివరాలు ఉన్నాయి. జనవరి 1వ తేదీన ఈ ప్రకటన చేసింది. 98.12 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్లు తెలిపింది. ఈ నోట్లను 19 మే, 2023న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్‌లో రూ.10, రూ.10, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్ల గురించే తెలిపింది. వీటితో పాటు ప్రస్తుతం చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల చిత్రాలను సైతం గుర్తించాం. అందులో రూ.5000 కరెన్సీ నోట్ ఫోటో కనిపించ లేదు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది. రూ.5000 కరెన్సీ నోట్ల విడుదల అనేది పూర్తిగా తప్పుడు వార్తగా పేర్కొంది. ఆర్‌బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదని జనవరి 4వ తేదీన పోస్ట్ చేసింది. దీంతో రూ.5000 నోట్లు విడుదల చేస్తున్నారన్న వార్త పూర్తిగా అవాస్తవమని తేలింది.
ఇది అసలు వాస్తవం
రూ.5000 కరెన్సీ నోట్లను విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా తప్పుడు వార్త.