మన దేశంలో కొన్ని వ్యాపారాలు నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా ఏడాది పొడవునా ఫుల్ జోష్‌తో సాగుతుంటాయి. అలాంటి వాటిల్లో పెట్రోల్ బంక్ బిజినెస్ ఒకటని చెప్పక తప్పదు. మంచి ప్రైమ్ లొకేషన్‌లో బంక్ ఉంటే 24 గంటలు డిమాండ్ ఉంటుంది. పెట్రోల్ పంప్ ఏర్పాటుతో మంచి లాభాలు ఉంటాయని తెలుసుకుని చాలా మంది తామూ ఏర్పాటు చేయనుకుంటారు. కానీ, ఎలా చేయాలో తెలియదు. ఈ వ్యాపారంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత భారీగా ఆదాయం పొందవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడితో పాటుగా కొంత అనుభవం ఉండాలి. మీరు అన్ని అర్హతలు కలిగి ఉండి కొత్త బంక్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ బెస్ట్ డీల్ తీసుకొచ్చాం. ప్రముఖ ప్రైవేట్ ఆయిల్ రిటైలింగ్ సంస్థ నయారా ఎనర్జీ కొత్త బంకుల ఏర్పాటుపై ప్రకటన చేసింది. ఈ ఏడాది కొత్తగా 400 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్‌గా కొనసాగుతున్న నయారా ఎనర్జీ ఈ ఏడాది మరో 400 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. వివిధ రాష్ట్రాల్లో తమ రిటైల్ నెట్‌వర్క్ విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీ సంస్థకు 6,500 పైగా రిటైల్ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో మరో 400 బంకులు ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. 21 ఏళ్ల వయసు నిండి 55 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంతి 10వ తరగతి పాసవ్వాలి. రిటైల్ అవుట్‌లెట్, ఇతర వ్యాపారంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆదాయం రూ.25 లక్షలకుపైన ఉండాలి. ఎలాంటి నేర చరిత్ర లేకుండా బిజినెస్ లోన్ డీఫాల్టర్‌గా ఉండకూడదు. అర్బన్ ప్రాంతాల్లో బంక్ ఏర్పాటు కోసం సింగిల్ డిస్పెన్సింగ్ కోసం అయితే 500 చదరపు మీటర్ల ల్యాండ్ ఉండాలి. రెండింటికి అయితే 800 చదరపు మీటర్ల భూమి ఉండాలి. నేషనల్ హైవేల పక్కన అయితే ఒక డిస్పెన్సింగ్ యూనిట్‌కి 1200 చదరపు మీటర్లు, రెండింటికి 2000 చదరపు మీటర్లు ఉండాలి. ప్రాంతాన్ని బట్టి పెట్టుబడి రూ.1 కోటి వరకు కావచ్చు. లైసెన్స్ ఫీజు కోసం రూ.2-5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
నయారా ఎనర్జీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకునే వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nayaraenergy.com వెబ్‌సైట్లో పెట్రోల్ పంప్ నెట్‌వర్క్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్ ద్వారానూ అప్లై చేసుకోవచ్చు. అందుకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషలో అప్లికేషన్ ఫారం ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం 1800 267 8622 నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నయారా ఎనర్జీ తమ పెట్రోల్ పంపుల్లో ఆటోమేషన్ తీసుకొస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్‌పై తమ బంకుల్లో లీటరుకు రూ.5 మేర తగ్గింపు అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే వారికి పలు ప్రయోజనాలు సైతం కల్పిస్తోంది.