ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం చాలా పాపులర్ అయింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు సైతం చేసే వీలు కలిగింది. బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకుని దాని ద్వారా ఒక్క రోజులోనే మల్టిపుల్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నాం. ఒక్క రోజులో రూ.1 లక్ష వరకు డబ్బులు పంపించవచ్చు. దీంతో చాలా మంది పెద్ద ట్రాన్సాక్షన్లకు సైతం యూపీఐ వాడుతున్నారు. బ్యాంకులోనూ తరుచూ డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు. అయితే, పరిమితులు తెలియకుండా బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చు.
బ్యాంకుల్లో రూ.50 వేలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీటీడీ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షలకు మించి డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడం వంటివి చేస్తే ఆ వివరాలు ఐటీ శాఖకు వెళ్తాయి. పరిమితికి మించి నగదు జమ చేసినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చూపించే ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. వాటికి ట్యాక్స్ చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావచ్చు. అప్పుడు ఆదాయ వనరులు చూపించకపోతే భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.
మరోవైపు.. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారు సైతం నిబంధనలు తెలుసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు ఆపైన ఎఫ్‌డీ చేసే వారి వివరాలు సైతం ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తాయి బ్యాంకులు. మీరు చిన్న చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేసినా మొత్తం కలిపి లిమిట్ దాటితే ఐటీ శాఖ నిఘా నీడలోకి వెళ్తారు. దీంతో మీకు ఐటీ నోటీసులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏదైన ఇళ్లు, భూమి వంటి ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతన్నా ఎక్కువ మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్లు చేసినా ఆస్తి రిజిస్ట్రార్ ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు నిర్వహించే వారు కచ్చితంగా ఈ నిబంధనలు తెలుసుకోవాలి. పరిమితికి మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించే ధ్రువీకరణ పత్రాలను దగ్గర పెట్టుకోవాలి.