విజయవాడలో అర్ధరాత్రి అలజడి రేగుతోంది. కొందరు దుండగులు వచ్చి.. ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులు, స్కూటర్లను తగలబెట్టి పారిపోతున్నారు. నగరంలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు.. ఇళ్ల ముందు పార్క్ చేసిన మోటార్ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మూడు స్కూటర్లు, రెండు బైకులు తగలబడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఒంటిగంటా 30 నిమిషాల సమయంలో బైకులకు నిప్పు పెడుతున్న దృశ్యాలు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా తగలబడిన వాహనాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇళ్ల ముందు పార్క్ చేసిన బైకులను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడం ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. వాహనాల యజమానుల ఫిర్యాదుతో భవానీపురం పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తోంది.
కొందరు మద్యం మత్తులో ఇలా చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కొందరు మద్యం మత్తులో బైక్‌లకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇళ్ల ముందు బైకులు పార్క్ చేయాలంటే భయంగా ఉందంటున్నారు. అందుకే రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తే బావుంటుందంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
విజయవాడ పోలీసులు 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' పేరుతో నగరంలో హెల్మెట్‌పై పోలీసులు అవగాహన కల్పించడంతో ఎక్కువ శాతం వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు. అలాగే హెల్మెట్ ధరించని వాహనదారులు కూడా హెల్మెట్ ధరించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో సోషల్ మీడియా లో ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజయవాడ పోలీసులు సూచిస్తున్నారు. లింకు వస్తుంది.. మోసం మొదలవుతుందని.. లైక్, షేర్ చేస్తే, రివ్యూలు ఇస్తే డబ్బు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెబుతారన్నారు. బాధితులు వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని.. http://CYBERCRIME.GOV.IN సైట్ లో మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయాలని సూచించారు.