ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారిలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లే ఉంటుంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా స్థిర ఆదాయం కోరుకుంటుండడమే ఇందుకు కారణంగా చేప్తారు. అందులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద బ్యాంకులనే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు సైతం జనరల్ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తోంది. అలాగే కొన్ని బ్యాంకులు 80 ఏళ్ల వయసు దాటిన వారికి మరింత ఎక్కు వడ్డీ అందిస్తున్నాయి. అందులో ఈ 5 బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయని చెప్పవచ్చు. స్పెషల్ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల ద్వారా అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి.
ఎస్బీఐలో కొత్త స్కీమ్..
ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవలే 80 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ఎస్బీఐ పాట్రోన్స్ పేరుతో ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ప్రకటించింది. దీని ద్వారా సీనియర్ సిటిజన్లతో పోలిస్తే వివిధ టెన్యూర్లపై 10 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ కల్పిస్తోంది. ఇక 2-3 ఏళ్ల స్పెషల్ డిపాజిట్ ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.60 శాతం వడ్డీ ఇస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో..
పంజాబ్ నేషనల్ బ్యాంకు సూపర్ సీనియర్ సిటిజన్లకు 400 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 8.10 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లతో పోలిస్తే ఇది 30 బేసిస్ పాయింట్లు అధికం. అలాగే ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపైనా అధిక వడ్డీ రేట్లు కల్పిస్తోంది.
ఆర్బీఎల్ బ్యాంక్..
ఆర్బీఎల్ బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ అందిస్తోంది. 500 రోజుల టెన్యూర్ స్పెషల్ స్కీమ్ ద్వారా గరిష్ఠంగా 8.75 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లతో పోలిస్తే ఇది 25 పాయింట్లు అధికం. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఇస్తోంది. దానిపై మరో 25 పాయింట్లు కల్పిస్తోంది.
ఇండియన్ బ్యాంకు..
ఇక ఇండియన్ బ్యాంకులోనే సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ కల్పిస్తోంది. 400 రోజుల ఇండ్ సూపర్ స్పెషల్ స్కీమ్ పై గరిష్ఠంగా 8.05 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీమ్ మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ సైతం సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు వడ్డీ కల్పిస్తోంది. 456 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా గరిష్ఠంగా 8.05 శాతం వడ్డీ అందిస్తోంది.