ట్రెండింగ్
Epaper    English    தமிழ்

56 శాతానికి పెరగనున్న డీఏ..? జనవరి 1 నుంచే అమల్లోకి.. జీతం ఎంత పెరుగుతుంది

business |  Suryaa Desk  | Published : Thu, Jan 09, 2025, 12:22 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా.. వీటికి పరిహారంగా కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరిగితే డీఏ పెరుగుతూ ఉంటుంది. గత కొంత కాలంగా డీఏ పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం.. డీఏను సవరిస్తుంటుంది. ఇది జనవరి 1, జులై 1 నుంచే అమల్లోకి వస్తున్నప్పటికీ.. ఏటా ఆలస్యంగా మార్చిలో ఒకసారి, సెప్టెంబర్ లేదా అక్టోబరులో మరోసారి డీఏపై ప్రకటన చేస్తూ ఉంది. బకాయిలతో కలిపి ముందువి అంటే జనవరి 1, జులై 1 నుంచే చెల్లిస్తుంటుంది కేంద్రం. ఇటీవల దీపావళి సమయంలో డీఏను 3 శాతం పెంచి.. 50 నుంచి 53 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు కొత్త సంవత్సరం రాగా.. జవవరి నెలలో సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి కూడా మార్చి మొదటి వారంలోనే ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డీఏను కేంద్రం.. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్  డేటా ఆధారంగా నిర్ణయిస్తుంటుంది.


చివరిసారిగా నవంబర్ నెలలోనే ఏఐసీపీఐ డేటా విడుదల చేసింది కార్మిక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ డేటా ప్రకారం.. డీఏ మరో 3 శాతం పెరిగి 56 శాతానికి చేరాల్సి ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే 2025 మార్చిలో ప్రకటన వచ్చినప్పటికీ.. 2025, జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రావాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు బకాయిలతో కలిపి ఏప్రిల్ జీతంతో కలిపి విడుదల చేయాల్సి ఉంటుంది.


నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉన్నప్పటికీ.. డీఏను నిర్ణయించడంలో డిసెంబర్ గణాంకాలు కూడా కీలకం కానున్నాయి. వీటన్నింటి సగటును బట్టి తుది డీఏను నిర్ణయిస్తారని చెప్పొచ్చు. చివరిగా 55 శాతం లేదా 56 శాతానికి డీఏ చేరుతుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగితే.. ఇదే సమయంలో పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) కూడా పెరగాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకుంటే.. కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.


జీతం ఎంత పెరుగుతుంది?


డీఏ అనేది ఉద్యోగుల కనీస వేతనంపై (బేసిక్ పే) వర్తిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ. 30 వేలు అనుకుంటే.. ఇక్కడ 53 శాతం డీఏ ప్రకారం వారికి రూ. 15900 వచ్చేది. ఇప్పుడు మరో 3 శాతం పెరిగితే.. 56 శాతం డీఏ ప్రకారం.. మొత్తం రూ. 16,800 అంటే .. అప్పుడు రూ. 900 పెరుగుతుందని చెప్పొచ్చు. డీఆర్‌కు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com