ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేట్ పొందేందుకు అర్హత ఉన్న ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందించింది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. ఎవరైతే జులై 5, 2024 తర్వాత ట్యాక్ రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కోల్పోయారో వారికి మరో అవకాశం లభించింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 87ఏ కింద ట్యాక్స్ రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు జనవరి 15, 2025 వరకు అవకాశం ఇచ్చింది.
ఇప్పుడు ఐటీఆర్ ఫామ్స్ 2, 3లో అప్డేట్ చేసిన ఎక్సెల్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన సెక్షన్ 87ఏ రిబేట్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే HTML యుటిలిటీలు సైతం త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు సోమవారమే ఓ ప్రకటన జారీ చేసింది. కొత్త సదుపాయం ప్రకారం ఐటీఆర్ ఎక్సెస్ యుటిలిటీలో మాన్యువల్‌గా ట్యాక్స్ రిబేట్ కాలమ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్యాక్స్ రిబేట్ క్లెయిమ్ చేసినట్లు వాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ట్యాక్స్ రిబేట్ కాలమ్ ఖాళీగా వదిలేస్తే ఎలాంటి రిబేట్ రాదని గుర్తుంచుకోవాలి. అలాగే పూర్తి వివరాలు తెలుసుకుని అప్డేట్ చేయాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.
అర్హత కలిగిన ట్యాక్స్ పేయర్లందరూ సెక్షన్ 87ఏ కింద రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వారు బిలెటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఇ-ఫైలింగ్ ఐటీఆర్ పోర్టల్ ద్వారా పైల్ చేసిన ఐటీఆర్‌ని ప్రాసెస్ చేసేందుకు HTML ఆధారిత యుటిలిటీ అనేది బ్యాకెండ్‌లో సాయం చేస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. స్వల్ప కాలిక మూలధన లాభాలు వంటి ప్రత్యేక ఆదాయం ఉన్నట్లయితే సెక్షన్ 87ఏ పన్ను రాయితీని క్లెయిమ్ చేసేందుకు ఎక్సెస్ ఐటీఆర్ యుటిలిటీలో రిబేట్ కాలమ్‌ను మాన్యువల్‌గా సవరించడం మాత్రమే పరిష్కారంగా సూచిస్తున్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం జనవరి 7వ తేదీన ఐటీఆర్ ఫామ్స్ ఐటీఆర్-2, ఐటీఆర్- 3 అప్డేట్ చేసినట్లు తెలిపింది. అయితే హెచ్‌టీఎంఎల్ యుటిలిటీ అందుబాటులోకి రాకపోవడంతో సెక్షన్ 87ఏ కింద రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు ఇంకా అనుమతించడం లేదని పలువురు ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ట్యాక్స్ రిబేట్ క్లెయిమ్ చేసుకునేందుకు జనవరి 15, 2025 వరకే అవకాశం ఉంది. ఇప్పటికే వారం గడిచి పోయిన క్రమంలో మళ్లీ ఆందోళన నెలకొంది. హెచ్‌టీఎంఎల్ యుటిలిటీ అందుబాటులోకి తీసుకురాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడువు పెంచినా సరైన సదుపాయాలు అందుబాటులోకి తేలేదని పేర్కొంటున్నారు.