చదువు చెప్పాల్సిన ఓ ట్యూషన్ టీచర్.. తన వృత్తిని వదిలేసి అమాయక బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఆమెకు మాయమాటలు చెప్పాడు. అయితే ట్యూషన్ టీచర్ చెప్పిన మాటలు విని నమ్మిన ఆ బాలిక అతడితో లేచిపోయింది. అప్పటికే ఆ ట్యూషన్ టీచర్‌కు పెళ్లి అయి.. 2 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆ బాలిక ట్యూషన్ వెళ్లే దారిలో ఆమెను తీసుకుని ట్యూషన్ టీచర్.. ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తమ కుమార్తె కనిపించక అల్లాడిపోయిన తల్లిదండ్రులు.. అంతా వెతికారు. చివరికి చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెతికి చివరికి 2 నెలల తర్వాత బాలికను రక్షించి.. తల్లిదండ్రులకు అప్పగించారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన 25 ఏళ్ల ట్యూషన్ టీచర్ అభిషేక్ గౌడ.. తన ట్యూషన్‌కు వచ్చే బాలికతో కలిసి పారిపోవడం సంచనలంగా మారింది. అయితే ఈ ఘటన జరిగిన 6 వారాల తర్వాత పోలీసులు వెతికి పట్టుకున్నారు. నవంబర్ 23వ తేదీన ట్యూషన్‌కు వెళ్తున్న బాలికను అభిషేక్ గౌడ తీసుకెళ్లాడు. అయితే ట్యూషన్ కోసం వెళ్లిన తమ కుమార్తె ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు జేపీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు.
అప్పటి నుంచి బాలిక కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఈనెల 5వ తేదీన మండ్య జిల్లాలోని మాలవల్లి తాలుకాలో బాలికను గుర్తించి.. రక్షించారు. అనంతరం ఆమెను తీసుకువచ్చిన ట్యూషన్ టీచర్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కిడ్నాప్, రేప్ అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే అభిషేక్ గౌడకు పెళ్లి అయిందని.. 2 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నట్లు మండ్య సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీజే లోకేష్ వెల్లడించారు. తమ కుమార్తె సురక్షితంగా ఇంటికి రావడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.