తప్పు చేస్తే ఏ శిక్ష కైనా తాను సిద్ధమని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.