ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీని వైసీపీ నేతలు ఏటీఎం మిషన్‌గా మార్చేశారన్న‌ అనురాధ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 07:02 PM

తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుని, కలియుగ దైవాన్ని కూడా దోచేసిన వైసీపీ నేత‌, అవినీతి అనకొండ రోజా రెడ్డి కూడా తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధానితో శంకుస్థాపన సమయంలోనే అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం అని పేర్కొన్నారు.  ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి, ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేసింద‌ని తెలిపారు. అలాగే చనిపోయినవారికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడినవారికి రూ. 5 లక్షల పరిహారం ప్రభుత్వం అందిస్తోందని పంచుమర్తి అనురాధ అన్నారు. 31 క్రిమినల్ కేసులతో 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని ఆమె ప్ర‌శ్నించారు. ప్రజాధనం వృథా చేసి రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్‌ & కో కబ్జాల బాగోతం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసునని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్, అనుచరులు, ముఖ్యంగా రోజా డ్రామాలు ఆడేందుకు పరామర్శ నెపంతో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వెళ్లారా? అని ఆమె నిల‌దీశారు. ఉహించని సంఘటనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు వారి హయాంలో జరిగిన గోదావరి బోటు ప్రమాదం, అన్నమయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోవడం, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వంటి నిర్లక్ష్యంతో జరిగిన మరణాలు గుర్తు లేవా? అని ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలని అసలు మనుషులంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి & కో చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వాడలేదన్నారు. టిక్కెట్లు అమ్ముకోలేదని, తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం వంటివి చేయలేదని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వైసీపీ నేతలు తిరుమల, వెంకటేశ్వరస్వామి, భక్తుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె అన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో అహంభావంతో తిరిగిన జగన్‌కు నిజంగా స్వామి మీద భక్తి ఉందా? అని ప్రశ్నించారు. టీటీడీని వైసీపీ నేతలు ఏటీఎం మిషన్‌గా మార్చేశారని అనురాధ విమర్శించారు. వైసీపీ పాలనలో అవినీతిపరులు, నేరచరిత్ర ఉన్నవారితో టీటీడీ బోర్డును నింపేశారని ధ్వ‌జ‌మెత్తారు. కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైనప్పుడు, అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు, తిరుమల టిక్కెట్లపై అన్యమత ప్రచారం జరిగినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్య‌బ‌ట్టారు.తన అవినీతికి తిరుమలను అడ్డాగా మార్చి, టిక్కెట్లను అమ్ముకుని లక్షల్లో సంపాదించారని ఆరోపించారు. వివిధ నగరాల్లో కోట్లలో గెస్ట్ హౌసులు, భూకబ్జాలు, బెల్ట్ షాపుల ద్వారా వందల కోట్లు దోచుకున్నారంటూ రోజా మీద ధ్వజమెత్తారు. గ్రావెల్ దోపిడీ, టూరిజం, విజయపురం కొండ తవ్వకం వంటి దోపిడీతో ప్రజల సొమ్ము దోచుకున్న వైసీపీ నటి రోజా రెడ్డి అలియాస్ శ్రీలత రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.వైసీపీ నేతలు టీటీడీ ఛైర్మన్ గురించి మాట్లాడే ముందు ఆయన గురించి తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. బీఆర్ నాయుడు తన కుటుంబ సభ్యుల గెస్ట్ హౌస్ ఖర్చులు తనే చెల్లించి, ప్రోటోకాల్ వెహికల్స్ వాడకుండా, కాఫీ టీ ఖర్చులు సైతం స్వయంగా భరిస్తున్నారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాగా తిరుమలని దోచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పరామర్శ నెపంతో వెళ్లిన జగన్ రెడ్డికి ఊహించిన డ్రామా క‌నిపించకపోవడంతో అసహనంతో డాక్టర్లను తిట్టడం, రోగులను ఇబ్బంది పెట్టడం చేశారంటూ విమర్శించారు. ఇదేనా పరామర్శ అని ప్రశ్నిస్తూ, ప్రజలు జగన్ డ్రామాలు గమనిస్తున్నారని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com