ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. గోకులాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత తనను వదిలేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గాన్ని కాపాడుకోలేకపోతే ఇక తనకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. అలాగే పిఠాపురం పోలీసులు పద్ధతి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురంలో పోలీస్ తీరు బాగోలేదని విమర్శించారు. దొంగతనాలు పెరిగాయంటూ తన దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పిఠాపురంలో గంజాయి వినియోగం సైతం పెరిగిందంటూ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయాలను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇకపై పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో ఈవ్ టీజింగ్ అంశం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అమ్మాయిలను వేధించడమే ఈవ్ టీజింగ్ అంటే తొక్కి నార తీస్తానంటూ హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఈవ్ టీజింగ్ అనే మాట వినపడకూడదని పోలీసులను హెచ్చరించారు. "ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లలను వేధించడం మగతనం కాదు. మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్‌కు వెళ్లండి. మగతనం నిరూపించుకోవాలంటే దేశం కోసం సైన్యంలో చేరండి. ఆడపిల్లలను ఏడిపించి అదే మగతనమంటూ పిచ్చ పిచ్చ వేషాలేస్తే తొక్కిపట్టి నారతీస్తా." అంటూ హెచ్చరించారు.
"ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లిలేనిదే సృష్టి లేదు. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ అనేది కనిపించకూడదు. ఈ విషయాన్ని పోలీసులకు స్పష్టంగా చెప్తున్నా. నా నియోజకవర్గాన్ని నేను చక్కదిద్దుకోలేనప్పుడు నేను అధికారంలో ఉండటం ఎందుకు. డిప్యూటీ సీఎంగా ఉండటం ఎందుకు? తప్పు చేసి కులం వెనుక దాక్కుంటే బయటకు తీసుకొస్తాం. క్రిమినల్స్‌కు కులం లేదు. ఈ విషయాన్ని అధికారులకు స్పష్టంగా చెప్తున్నా. " అంటూ పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మరోవైపు పిఠాపురం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలు మొదలెట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకు రౌడీలకు, మందుపాతర్లకు భయపడే రకాన్ని కాదన్న పవన్ కళ్యాణ్.. తాను తెగించాను అంటే పిచ్చగా ఉంటుందన్నారు. పిఠాపురం నుంచి మొదలెట్టి ప్రతి జిల్లాకు వస్తానన్న పవన్ కళ్యాణ్.. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఇలానే ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలనలో అవినీతి తగ్గిపోయిందని చెప్పారు. పూర్తిగా నిర్మూలించలేమని.. కానీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోతున్నానని క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరారు.