వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ వేళ జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ ప్రమాదంపై క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారన్నారు. ఎవరో ఏదో మాట్లాడారని అన్నింటికి స్పందించాల్సిన అవసరమైతే లేదన్నారు.ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ... తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. తప్పిదం జరిగిందని, ఎలా జరిగిందనేది విచారణలో వెల్లడవుతుందన్నారు. విచారణను త్వరగా పూర్తి చేయాలని సీఎంను కోరుతామన్నారు. ఆ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే న్యాయవిచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామన్నారు. మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, శనివారం ఉదయం వారి ఇళ్లకు వెళ్లి వాటిని అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.