ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచే అయోధ్య రామమందిర వార్షికోత్సవాలు.. ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 08:11 PM

500 ఏళ్ల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దివ్య భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుపుకుంది. అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్ఠించి ఏడాది పూర్తి కాగా.. ఇప్పుడు తొలి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలో నిర్వహించే వేడుకల కోసం ఆలయ ట్రస్ట్, అయోధ్య జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈ వేడుకలు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే గతేడాది జనవరి 22వ తేదీన అయోధ్య ప్రారంభోత్సవం జరగ్గా ఈసారి మాత్రం జనవరి 11వ తేదీన ప్రారంభించారు. అయితే సంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగా తిథి రోజున నిర్వహిస్తున్నారు. అయోధ్యలో జరుగుతున్న మొట్టమొదటి వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.


ఈ నేపథ్యంలోనే శనివారం ప్రారంభం అయిన ఉత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం ద్వారా నిర్మించిన ఈ అయోధ్య రామాలయం భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వమని తెలిపారు. ఈ దివ్యమైన, అద్భుతమైన బాలరాముడి ఆలయం వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో ప్రధాన ప్రేరణగా పనిచేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.


ఇక అయోధ్య రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకల కోసం ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇక శనివారం ప్రారంభం అయిన ఉత్సవాల్లో.. మొదట బాల రాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. బాల రాముడి కోసం ఢిల్లీకి చెందిన డిజైనర్ల బృందం బంగారం, వెండి నూలు పోగులతో ప్రత్యేక పీతాంబరాలను తయారు చేసింది.


హిందువుల పండుగలు.. ఆచార వ్యవహారాలు సంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్య మాసంలోని.. శుక్ల పక్ష ద్వాదశి నాడు(2024 జనవరి 22) అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. విష్ణుమూర్తి పది అవతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు అదే కావడం గమనార్హం. క్షీర సాగర మథనం సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసిన సందర్భం కూడా. రాముడు కూడా విష్ణు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు కూడా శుభదినంగా పరిగణించారు. 2025 హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది కూర్మద్వాదశి జనవరి 11వ తేదీన వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com