అవకాశం దొరికినప్పుడల్లా గత వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి వైసీపీపైనా, గత ప్రభుత్వ తీరుపైనా విమర్శలు చేశారు. అయితే ఈసారి నేరుగా కాకుండా పరోక్షంగా తాను చెప్పాలనుకుంటున్నది లెక్కలతో సహా వెల్లడించారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం తాము ఏం చేశామనే వివరాలను పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి తాను ఏం చేశాననే వివరాలను ఇప్పటికే వెల్లడించిన పవన్ కళ్యాణ్.. ఈ ఆరు నెలల కాలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన పనితీరుకు సంబంధించి వివరాలను పంచుకున్నారు. అయితే వైసీపీ హయాంలో ఏం చేశారు.. కూటమి ప్రభుత్వ పాలనలో ఏం చేశారనే దానిని పోలుస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ ఆరు నెలల కాలంలో సాధించిన ఘనతలు ఇవి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 1800 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మిస్తే.. టీడీపీ కూటమి సర్కారు ఆరు నెలల్లోనే 3750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే వైసీపీ ఐదేళ్ల పాలనలో 268 మినీ గోకులాలు ప్రారంభిస్తే.. టీడీపీ కూటమి సర్కారు ఆరు నెలల్లోనే 22500 మినీ గోకులాలు ఏర్పాటుచేసిందన్నారు. పీవీటీజీ ఆవాసాల కోసం గత వైసీపీ సర్కారు ఐదేళ్లలో 91 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. తాము ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేశామని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.
ఈ లెక్కల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు వైసీపీ సర్కారుతో పోలిస్తే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అలాగే గతంలో వైసీపీ, వైఎస్ జగన్ చేసింది ఇంత అయితే.. తాము ఆరు నెలల్లోనే పంచాయతీరాజ్ శాఖలో మెరుగైన పనితీరు కనబరిచామని ఈ లెక్కల ద్వారా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూటమి శ్రేణులు, మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నాయి. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.