నంద్యాల జిల్లాలోని శివుడి మహా పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలంలో టోల్ గేట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో ఎంట్రన్స్‌లో ఎన్నో ఏళ్లుగా ఒక టోల్ గేట్ ఉంది. సాధారణంగా ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలు టోల్‌గేట్ సిబ్బంది వసూలు చేస్తారు. అయితే ఆ టోల్‌గేట్‌లో పని చేసే సిబ్బంది.. గత కొంత కాలంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు చెప్పాపెట్టకుండా ఉన్నఫళంగా ఆ టోల్‌గేట్‌లో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అధికంగా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే ఏకంగా 8 మంది సిబ్బందిపై శ్రీశైలం దేవస్థానం అధికారులు వేటు వేశారు.
టోల్‌గేట్ వద్ద శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో టోల్‌గేట్‌లో ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎక్కువగా ఉన్న ఆ డబ్బు ఎక్కడిది అని అధికారులు.. టోల్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మరింత లోతైన విచారణ చేపట్టిన అధికారులకు అసలు విషయం తెలిసింది. నిర్ణయించిన టోల్ ఛార్జీల కంటే అధికంగా టోల్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో అధికారులు వారిపై వేటు వేశారు.
శ్రీశైలంకు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్‌గేట్ ద్వారా వాహనదారుల నుంచి టోల్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీన శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లోనే అసలు బండారం బయటపడింది. అప్పటినుంచి విచారణ జరపగా.. తాజాగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఆన్ లైన్ పేమెంట్ కాకుండా వాహనదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే టోల్‌గేట్ దగ్గర పని చేసే రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడు.. కాంట్రాక్టు సిబ్బంది నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జునరెడ్డి, బిఆర్ మల్లేశ్వర్ రెడ్డి.. రోజూ వారీ వేతన సిబ్బందిని శ్రీశైలం దేవస్థానం అధికారులు తొలగించారు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టోల్‌గేట్ వద్ద కొత్త సిబ్బందిని నియమించి.. టోల్ ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు.