ఏపీలో మరిన్ని మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా కొత్త మద్యం దుకణాల నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం అవుతోంది. కొత్త మద్యం పాలసీ అమలు తరువాత ఏపీ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.సంక్రాంతి వేళ మద్యం సేల్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి. ఏకంగా మూడు రోజుల్లో రూ 400 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా వినియోగం జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.ఏపీలో సంక్రాంతి వేళ మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా రూ 99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చింది. కొత్త సంవత్సరం వేళ భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని భావించగా.. ఇప్పుడు సంక్రాంతికి ఆ రికార్డు బ్రేక్ అయింది. తాజాగా సంక్రాంతి 3 రోజుల్లో 400 కోట్ల అమ్మకాలు జరిగాయి. సాధారణం కంటే 160 కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వినియోగం ద్వారా లిక్కర్ సేల్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి. ఇక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికుల కు రాష్ట్రంలో 340 మద్యం షాపుల కేటాయింపుకు రంగం సిద్దమైంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత ఉపకులాల వారీగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీచేశారు. అందులో 10శాతం ఇప్పుడు గీత కులాలకు ఇవ్వనున్నారు. అలా వచ్చే 340 షాపుల్లో నాలుగు షాపులు సొండి కులానికి విడిగా కేటాయిస్తారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాపును కేటాయించనున్నారు. మిగిలిన 335 షాపులకు నోటిఫికేషన్ జారీచేస్తారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దరఖాస్తు రుసుము రూ.2లక్షలుగా ఉంది. అయితే లైసెన్స్ ఫీజులు సగం చెల్లిస్తే సరిపోతుంది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా ఈ దుకాణాల ఏర్పాటుకు నిర్ణయించారు
తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకు కేటాయించారు. అల్లూరి జిల్లాలో ఒక్క టీ లేదు. అనంతపురంలో 14, శ్రీసత్యసాయిలో 9, అన్నమయ్యలో 11, చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 13, కాకినాడలో 16, కోనసీమలో 13, బాపట్లలో 12, గుంటూరులో 13, పల్నాడులో 13, కడపలో 14, కృష్ణాలో 12, ఎన్టీఆర్‌లో 11, కర్నూలులో 10, నంద్యాలలో 11, నెల్లూరులో 18, ప్రకాశంలో 18, పార్వతీపురం మన్యంలో 4, శ్రీకాకుళంలో 18, అనకాపల్లిలో 15, విశాఖ 14, విజయనగరంలో 16, ఏలూరులో 14, పశ్చిమగోదావరిలో 18 షాపులు గీత కులాలకు కేటాయించ నున్నారు. ఇందు కోసం గీత కులాలను మూడు కేటగిరీలు చేశారు. ఎ-కేటగిరీలో యాత, బి-కేటగిరీలో గౌడ, ఈడిగ, గౌడ(గమళ్ల), కలాలీ, గౌండ్ల, శ్రీసాయన, సొండి, శెట్టిబలిజ కులాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.