విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరులూదింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘ఇది భారీ రివైవల్ ప్యాకేజీ. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు..పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమవుతాయి ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరకు సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో చర్చిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్‌లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు’’ అని అశ్వినీవైష్ణవ్ తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. దిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో సమావేశమై కర్మాగారం పునరుజ్జీవంపై చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటీవల ప్రధానిని మరోమారు కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.