తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన తాతయ్య ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ‘‘యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి. ఆయన వర్థంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు’’ అని నారా లోకేష్ స్మరించుకున్నారు.