తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించారని.. వారికి రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు టీడీపీకి బడుగు, బలహీన వర్గాలే ఆయువుపట్టు అని తెలిపారు.ఎన్టీఆర్ విధానాలను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు వారసుడు చంద్రబాబు అయితే.. ఆయనకు వారసుడు నారా లోకేష్ అని ఉద్ఘాటించారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. తమను కించపరుస్తున్నారని టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీలో ఎలా ఉన్నారని నిలదీశారు. జగన్‌తో చేతులు కలిపి చంద్రబాబును నీ నోటికి వచ్చినట్లు ధూషిస్తావా అని విరుచుకుపడ్డారు. టీడీపీని పెట్టింది ఎన్టీఆర్ అయితే... బతికించింది చంద్రబాబు అని గుర్తుచేశారు. దశ దిశలా ప్రజల నుంచి టీడీపీకి మరింత ఆదరణ పెరుగుతోందని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల సారధ్యంలో టీడీపీ ప్రజాదరణ పొందుతుందని చెప్పారు. టీడీపీకి భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని బుద్దావెంకన్న పేర్కొన్నారు.