డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశ ద్రోహంతో సమానమన్నారు. అమిత్ షా పర్యటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ అమిత్ షాతో బహిరంగ క్షమాపణలకు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల పేర్కొన్నారు.