కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నిర్వహించిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా నూతన ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ నూతన ప్రాంగణాన్ని హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులతో కలిసి నారా లోకేశ్ పరిశీలించారు. సంస్థకు సంబంధించిన విషయాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అనంతరం ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ఇతర నేతలతో కలిసి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్క నాటారు. విపత్తుల సమయంలో ఎలా ఎదుర్కోవాలో తెలిపే విన్యాసాల రూపంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శనను వీక్షించారు. అనంతరం తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నేతలతో కలిసి మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు దగ్గరుండి నారా లోకేశ్ వీడ్కోలు పలికారు.