కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు క్విడ్ ప్రో కో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో చంద్రబాబు విందు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి, వైయస్‌ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఈ విందు సందర్భంగా తన కుమారుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాదేయపడ్డారని అన్నారు. దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నారా లోకేష్ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూళ్ళ వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మందలించారని తెలిపారు. అంతేకాకుండా లోకేష్‌ను అదుపులో పెట్టుకోవాలని కూడా చంద్రబాబుకు అమిత్ షా హితవు చెప్పారని అన్నారు. ఇవ్వన్నీ బయటకు రాకుండా ఉండేందుకు ఈ విందులో వైయస్ జగన్ నివాసాలపై చర్చ జరిగినట్లు తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో అబద్దపు కథనాలను రాయించారని ధ్వజమెత్తారు.