కోర్టులు, మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని, జవాబుదారీతనంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో సౌత్ జోన్-2 రెండు రోజుల జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సులో ఆదివారం ‘జ్యుడీషియరీ అండ్ గవర్నెన్స్ త్రూ ఎమర్జెంగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్, జ్యుడీషియరీ అండ్ మీడియా’ అనే అంశంపై పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ, మీడియా అందించే సమాచారం విశ్వసనీయతను కలిగి ఉండాలని, అదే పరస్పర సహకారానికి ప్రామాణికంగా నిలుస్తుందని చెప్పారు. కోర్టు వ్యవహారాల్లో, సమాచార చేరవేతలో మీడియా పాత్ర, తీర్పులు.. ఇతర ప్రక్రియల్లో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ వినియోగంపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషిమి భట్టాచార్య మాట్లాడుతూ, జ్యుడీషియరీ విభాగంలో పనిచేసే వారంతా మీడియాపై, అక్కడ జరిగే పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్రపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం.సుందర్ విశ్లేషించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని తుది ప్రామాణికంగా తీసుకోరాదన్నారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల ్హరి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవీ శేషమ్మ, సీనియర్ న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.