సంక్రాంతి పండుగ వేళ.. జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. ఆదివారం శ్రీకాకుళం, జి.సిగడాం మండలాల పరిధిలో 18 మంది పేకాడుతూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళంలోనే 12 మంది పోలీసులకు పట్టుబడగా.. వారి నుంచి రూ.11.13 లక్షలు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు... శ్రీకాకుళంలోని హయాతినగరం సమీపంలో ఆదివారం రాత్రి 12 మంది ఓ భవనం మేడ మీద పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఆ 12 మందిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.11.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇంత పెద్ద స్థాయిలో పేకాట సొమ్ము దొరకడంతో కలకలం రేగింది. పేకాడుతూ చిక్కిన వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.