శ్రీకాకుళం నగరంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. 24 గంటల తర్వాత ఆదివారం హత్యోదంతం వెలుగులోకి రావడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(53) శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దుస్తులు తెచ్చుకునేందుకు శ్రీకాకుళం వెళ్తున్నట్టు తన భర్తకుచెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రమైనా ఆమె రాకపోవడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. ఆదివారం ఉదయానికి ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త, కుమారుడు శ్రీకాకుళం నగరంలో వెతికారు. అయితే నగరంలోని న్యూ కాలనీలో గల ఓ ప్రైవేట్ కళాశాల వద్ద ఆమె తీసుకువచ్చిన వాహనాన్ని గుర్తించారు. దీంతో సమీపంలోని భవనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఓ ప్రముఖ వైద్యుడి ఇంటికి ఎదురుగా ఉన్న భవనంలోకి వెళ్లడాన్ని గుర్తించారు. ఆ భవనంలోకి వెళ్లి పరిశీలించగా.. ఆమె రెండో అంతస్థులోని ఓ ఇంటి బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆమె భర్త రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ పి.ఈశ్వరరావు ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో చేరుకుని వివరాలు సేకరించారు.