మూడేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం (తల నరికిన) ఘటనలో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు సాయం ఇవ్వడం చూస్తుంటే ఆ ఘటనలో టీడీపీ పెద్దల పాత్రపై అనుమానాలు వస్తున్నాయని మండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆ కేసులో నిందితుడికి ప్రభుత్వ సొమ్ము ఇవ్వడమే కాకుండా ఆ కార్యక్రమంలో మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత ప్రశ్నించారు. మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ 2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆరోజు సంఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయ నిధి నుంచి నిందితుడికిచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడిని డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు.