గుంటూరు మిర్చియార్డులో కొత్త సీజన్ మొదలైంది. సంక్రాంతి తరువాత రైతులు మిర్చిని అమ్మకానికి తీసుకురావడం ఆనవాయితీ. నిత్యం లక్షలాది బస్తాల సరకు వచ్చే అవకాశం ఉండడంతో యార్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం 90,567 బస్తాల టిక్కీ రాగా.. 77,096 బస్తాలు అమ్ముడుపోయాయి. సాయంత్రానికి 54,523 బస్తాల నిల్వ ఉంది. ప్రస్తుతం కొత్త పంట రాకతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లో సందడి నెలకొంటోంది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో తొలి కోతలు పూర్తయిన పంటను రైతులు తెస్తున్నారు. ప్రతి రోజు సుమారుగా 5 వేలమందికిపైగా రైతులు 90 వేల బస్తాలకుపైగానే మిర్చి తెస్తున్నారు. యార్డులోకి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా 3 గేట్ల నుంచి వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేశారు. రద్దీ పెరిగితే 5 గేట్లు తెరవనున్నారు. రైతులకు తాగునీరు, విశ్రాంతి గదులను సిద్ధం చేశారు. యార్డు లోపల అవసరాలకు తాత్కాలికంగా 25 మంది సీజన్ వర్కర్లను తీసుకోవాలని నిర్ణయించారు. అవసరాన్నిబట్టి 40 మంది వరకు సంఖ్య పెంచుకోనున్నారు.