అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నుంచి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వైదొలగారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ట్రంప్ కార్యవర్గంలోని కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. డోజ్‌కు వివేక్‌తోపాటు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌లను సంయుక్త సారథులుగా ట్రంప్ నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పని చేస్తోంది.
అయితే, అనూహ్యంగా వివేక్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ, ఓహియో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న వివేక్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను డోజ్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని వివేక్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘‘డోజ్‌ను సృష్టించేందుకు మద్దతు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.. ప్రభుత్వ వ్యవస్థ ప్రక్షాళనలో ఎలాన్ మస్క్, ఆయన బృందం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.. నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలోనే ఓహియోలో చెప్పాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ట్వీట్ చేశారు.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అత్యంత సన్నిహితుడిగానూ రామస్వామి గుర్తింపు పొందారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధిత్వానికి వివేక్ రామస్వామి పోటీపడి.. తర్వాత ట్రంప్‌కి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, రామస్వామిపై ప్రభుత్వ ఎఫిషియెన్సీ బృందం ప్రశంసలు కురిపించింది. డోజ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రకటనలో పేర్కొంది.
‘‘ఆయన ఎన్నికైన పదవికి పోటీ చేయాలని యోచిస్తున్నారు.. దాని ప్రకారం ఆయన డోజ్ నుంచి తప్పుకున్నారు.. గత రెండు నెలలుగా డోజ్ కోసం ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు.. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. వివేక్ రామస్వామి ఓహియో గవర్నర్‌గా పోటీచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు ఆయన సన్నిహితులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.