రైతన్న ఆరుగాలం కష్టం అగ్గిపాలైంది. ధాన్యం నిల్వ చేసిన పురులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శృంగవరపుకోట మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కిలారి శ్రీను, కిలారి కుమార్, ఈశ్వరరావు, అప్పలనాయుడు, సన్నిబాబు, కాసులమ్మ, ఈశ్వరమ్మ, భవానీలు గ్రామ సమీపంలోని కల్లాల్లో 8 ధాన్యం పురులు వేయించారు. ఒక్కో పురిలో 30 ధాన్యం మూటలు సరిపడే ధాన్యం నిల్వ చేశారు. పండుగ తరువాత వీటిని అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. అయితే సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ పురులకు నిప్పు అంటుకుంది. దాంతో రైతులు ఆప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు రూ.నాలుగు లక్షలు ధాన్యం బుగ్గపాలైందని రైతులు తలలు పట్టుకున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.